Shreyas iyer on Rahul Dravid: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించి భారత్ మంచి స్కోరు (345) సాధించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. టీమ్‌ఇండియా బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 296 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కు 49 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్లు జేమీసన్, సౌథీ దెబ్బకు 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (65) మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతకంతో మెరిశాడు.
ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన విషయాలను శ్రేయస్ వెల్లడించాడు. "ఎలాగైనా విజయం సాధించాలి. శతకం, అర్ధశతకం కంటే అదే ముఖ్యమైంది. రాహుల్ సర్ కూడా అధిక సమయం క్రీజ్‌లో నిలదొక్కుకోవాలని సూచించారు. మిడిలార్డర్‌లో పరుగులు రాబట్టేలా భాగస్వాయమ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. అందుకే సెషన్‌కు సెషన్‌కు వీలైనన్ని బంతులు ఆడాలని నిర్ణయించుకున్నా. ముందు జరగబోయే దాని గురించి ఆలోచించకుండా.. ఇప్పుడు ఏం చేయాలనేదానిమీదే దృష్టి పెడుతున్నా" అని వివరించాడు. తాము కనీసం 275-280 పరుగులను లక్ష్యంగా నిర్దేశించాలని భావించామని చెప్పాడు. భారత స్పిన్నర్ల మీద నమ్మకం ఉందని, ఆఖరి రోజు కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తామని పేర్కొన్నాడు. ఇంతకుముందు కూడానూ ఇలాంటి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున కాకుండా రంజీల్లో అనుభవించినట్లు వివరించాడు. ఒకే టెస్టులో శతకం, అర్ధశతకం సాధించిన శ్రేయస్‌కు ఆటగాళ్లు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.