Shreyas Iyer News: ప్రతి ఆటగాడిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయని టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మనలోని బలహీనతలపై ఎక్కువగా దృష్టి పెడితే.. బలాలను మర్చిపోతామని పేర్కొన్నాడు. దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుండటంతో.. శ్రేయస్ అతడి స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు (57, 74, 73) నమోదు చేసి జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో మొత్తం 174 స్ట్రైక్ రేటుతో 204 పరుగులు చేసిన శ్రేయస్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు' గెలుచుకున్న విషయం తెలిసిందే.
'షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వేరే వాళ్లు నాలో ఆ బలహీనత ఉందని భావించినా ఫర్వాలేదు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేందుకు నేనేం ప్రత్యేకంగా సాధన చేయలేదు. మన ఆలోచన తీరు సరిగా ఉంటే ఎలాంటి బంతినైనా సమర్థంగా ఎదుర్కోవచ్చు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కుంటూనే ఈ స్థాయికి రాగలిగాను. ప్రతి ఆటగాడిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. బలహీనతలను అధిగమించడంపై ఎక్కువగా దృష్టి పెట్టి.. మన బలాలను మర్చిపోకూడదు. నేను ఎలా ఆడుతున్నానో నాకు తెలుసు. వాటి ఫలితాలను మీరందరూ చూస్తున్నారు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచులో.. నేను ఎదుర్కొన్న తొలి 12 బంతులకు 12 పరుగులే చేశాను. ఆ తర్వాత పుంజుకుని ధాటిగా ఆడాను. చివరి రెండు మ్యాచుల్లో మొదటి నుంచే వేగంగా ఆడటం మొదలెట్టాను’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.
మూడో స్థానంలో దిగితే ఆ కిక్కే వేరూ