Shreyas Iyer KKR Captain IPL 2024 :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా తిరిగి నియామకమయ్యాడు. నితీశ్ రాణాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ మేరకు జట్టు మేనేజ్మెంట్ గురువారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్లో మరోసారి శ్రేయస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు కోల్‌కతా జట్టు సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు.
"గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2023 దూరం కావడం దురదృష్టకరం. అతడు మళ్లీ కెప్టెన్‌గా తిరిగి రావడం పట్ల మాకు సంతోషంగా ఉంది. శ్రేయస్ గాయం నుంచి కోలుకోవడానికి పడ్డ కష్టం, తర్వాత ఫామ్‌లోకి రావడం అతడి వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. శ్రేయస్ లేనప్పుడు నితీశ్ రాణా సారథ్య బాధ్యతలు చేపట్టి మెప్పించాడు. కేకేఆర్ టీమ్ కోసం నితీశ్ వైస్ కెప్టెన్‌గా, శ్రేయస్‌కు సాధ్యమైన ప్రతి విషయంలో మద్దతిస్తాడనంలో సందేహం లేదు."
--వెంకీ మైసూర్, కేకేఆర్ సీఈఓ
2022 ఐపీఎల్ ఎడిషన్‌లో కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా 2023 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో శ్రేయస్ స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలు నితీశ్ రాణాకు అప్పగించారు. తాజాగా కెప్టెన్సీ తిరిగి శ్రేయస్‌కు అప్పగించడానికి నితీశ్ ఒప్పుకున్నాడు. దీనిపై స్పందించిన శ్రేయస్ తాను లేని సమయంలో జట్టు బాధ్యతలను నితీశ్ సమర్థంగా నిర్వర్తించాడని కొనియాడాడు.