భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని అతడి భార్య ఆయేషాకు దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శిఖర్ ధావన్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన తప్పుడు ప్రసారాలు చేయటం సరికాదని న్యాయమూర్తి హరీష్ కుమార్ ఆయేషాకు ఆదేశించారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటం చాలా కష్టమన్న ఆయన ధావన్ పరువుకు భంగం కలిగే వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. కాగా.. ప్రస్తుతం శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయేషా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తోందని ధావన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయేషాను అలా చేయొద్దని ఆదేశించింది.
కాగా, శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని 2012లో వివాహం చేసుకున్నాడు. ఆయేషాకు ధావన్‌తో ఇది రెండవ వివాహం. ధావన్‌ను చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్‌ను వివాహం చేసుకున్నాక 2014లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే 2020లో వీరిద్దరికి మధ్య మనస్పర్థలు మొదలవ్వడం వల్ల.. ఈ వ్యవహారం విడాకుల దాకా వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి కుమారుడు జోరావర్ ధావన్ ప్రస్తుతం ఆయేషా దగ్గరే ఉంటున్నాడు.