టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. అలాగే ఫ్యాషన్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. శరీరంపై డిఫరెంట్ టాటులు కూడా వేయించుకుంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపాడు. తాను మొదటి టాటూ ఎప్పుడు వేయించుకున్నాడో.. ఆ టాటూ వల్ల ఎదురైన ఇబ్బందులను చెప్పాడు. రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది కూడా వెల్లడించాడు.
"నాకు 15 ఏళ్లు ఉన్న సమయంలో ఫ్యామిలీతో కలిసి మనాలి పర్యటనకు వెళ్లాను. అప్పుడు వారికి తెలియకుండా వీపుపై ఓ టాటూను వేయించుకున్నాను. ఈ విషయాన్ని దాదాపు 3-4 నెలల పాటు ఎవరికీ తెలియకుండా దాచాను. ఆ తర్వాత ఒకరోజు మా నాన్నకు ఈ విషయం తెలిసిపోయి నన్ను బాగా కొట్టేశారు. నిజానికి టాటూ వేయించుకున్న తర్వాత నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆ సూదితో అతడు ఎంతమందికి ఆ టాటూలు వేశాడో తెలీదు కదా. దాంతో నేను హెచ్‌ఐవీ టెస్టు కూడా చేయించుకున్నాను. నెగటివ్ రిపోర్ట్ వచ్చింది(నవ్వుతూ)" అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారా అని అడగగా.. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పాడు. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. "ప్రస్తుతం నాకు అలాంటి ఆలోచనలు లేవు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలని రాసిపెట్టుంటే తప్పకుండా అది జరుగుతుంది. నేను ఏ రంగంలో ఉన్న 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటాను. కచ్చితంగా సక్సెస్ అవుతానని తెలుసు. నేను నా 11 ఏళ్ల వయసు నుంచి కష్టపడి పనిచేస్తున్నా. పాలిటిక్స్ వెళ్లే విషయంపై నేను ఇప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదు. నేను ఈ రాజకీయాల్లోకి రావాలని దేవుడు సంకల్పిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాను" అని ధావన్ వివరించాడు.