సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి.టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే ప్లేయర్లకు విశ్రాంతి లభించాలని కెప్టెన్సీని ధావన్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించాయి. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కూడా వన్డే సిరీస్‌కు విశ్రాంతి లభించనుంది. స్టాండ్ ఇన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ఎనిమిదో ఎడిషన్ ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది.
దక్షిణాఫ్రికాతో టీ20, వన్డేలు ఇలా.. సెప్టెంబర్ 28నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, అలాగే మూడు వన్డేలు ఆడనుంది. మొదటి టీ20 సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో జరుగుతుంది. రెండోది అక్టోబర్ 2న గౌహతిలో, మూడోది అక్టోబర్ 4న ఇండోర్‌లో జరుగుతాయి. ఇక అక్టోబర్ 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. లక్నో వేదికగా తొలి వన్డే జరగనుంది. అక్టోబరు 9, 11తేదీల్లో వరుసగా రెండో, మూడో వన్డేలకు రాంచీ, దిల్లీ వేదికలు కానున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.