మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక(IND Vs SL) మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో శిఖర్ ధావన్(Shikhar Dhawan) సారథ్యంలో టీమ్ఇండియా బరిలో దిగనుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఓ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ కెరీర్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ధావన్ మరో 35 పరుగులు చేయాల్సి ఉంది. అయితే లంకతో జరగనున్న తొలి మ్యాచ్లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఆ ఘనతను సాధించిన 14వ భారత బ్యాట్స్మన్గా(261 ఇన్నింగ్స్లో) ధావన్ రికార్డుకెక్కుతాడు.
శిఖర్ ధావన్ కెరీర్లో ఇప్పటివరకు 142 వన్డేల్లో 45.28 సగటుతో 5,977 పరుగులు చేయగా.. అందులో 17 సెంచరీలు 32 అర్ధశతకాలున్నాయి. దీంతో పాటు భారత్ తరఫున 34 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2,315 రన్స్ సాధించగా.. 65 టీ20లు ఆడి 1,673 పరుగులు నమోదు చేశాడు.