Shikhar Dhawan Asia Cup 2023 : ఎడమ చేతి వాటం బ్యాటింగ్‌తో అద్భుతమైన షాట్లు.. ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు.. క్యాచ్ పట్టగానే మైదానంలో తొడగొట్టడం.. ఇలా చెప్పగానే మనకు ఇట్టే గుర్తుకొచ్చేది ఒక్కడే ఒక్కడు. అతడే టీమ్ఇండియా బ్యాటర్ శిఖర్ ధావన్. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో తిరుగులేని రికార్డులను తన ఖాతాలోకి వేసుకున్న ఈ స్టార్ ప్లేయర్.. అప్పటి ఆటగాళ్ల నుంచి ఇప్పటి యంగ్‌స్టార్స్ వరకు అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం ఈ సీనియర్ భారత బ్యాటర్ కెరీర్‌పై అభిమానుల్లో ఎన్నో ప్రశలు మొదలయ్యాయి.
ఇక ఇతడి కెరీర్ ముగిసే దిశగా సాగుతుందా? లేదా అతడిని ఇక టీమ్‌ఇండియా జెర్సీలో చూడడం కష్టమేనా? క్రికెట్ వర్గాల్లో గబ్బర్ అని పిలుచుకునే ఇక అతని ఆట గతమేనా? అంటూ నెట్టింట అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే వీటన్నింటికీ.. అవును అనే సమాధానామే వినిపిస్తోంది. తాజాగా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత వన్డే జట్టులో ధావన్‌కు చోటు దక్కకపోవడమే ఈ జవాబుకు కారణం. అంతే కాకుండా ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌నకు జట్టు కోసం ఈ ఆసియా కప్‌లో ఆడే భారత జట్టు నుంచే ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల స్టార్ బ్యాటర్‌కు టీమ్ఇండియాలో తిరిగి చోటు దక్కడం కష్టమేనంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అరంగేట్రంతోనే అదుర్స్..
Dhawan International Career :అందరిలానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధావన్.. అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే తన దైన శైలిలో ఆడి అందరి చేత ఔరా అనిపించాడు. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో.. 2011లో టీ20ల్లో, 2013లో టెస్టుల్లో అడుగులు వేశాడు. ఇక 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన అరంగేట్ర ఆటగాడిగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు (187) నమోదు చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు.
మరోవైపు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేల్లో శతకాలు సాధించాడు. కానీ ఇప్పుడు అతడి ఫామ్‌లో తడబడటం వల్ల.. పరుగుల వేటలో విఫలమవుతున్నాడు. దీంతో తన 13 ఏళ్ల అంతర్జాతీయ ప్రస్థానానికి ఇక స్వస్తి పలికే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాడు.