న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మరో రెండు రోజుల్లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. భారత కెప్టెన్‌గా శిఖర్ ధావన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇటీవలే టీ20 లీగ్‌లోని పంజాబ్ ఫ్రాంచైజీకి సారథిగా ధావన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా కివీస్‌తో వన్డే సిరీస్‌తోపాటు పంజాబ్ కెప్టెన్సీపై శిఖర్ ధావన్ స్పందించాడు.
"కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే మనం కచ్చితమైన నిర్ణయాలు తీసుకొనేందుకు నమ్మకం కలుగుతుంది. ఇంతకుముందు బౌలర్‌కు ఇబ్బందిగా ఉన్నప్పటికీ అదనంగా ఓవర్ వేయించేవాడిని. కానీ ఇప్పుడు జట్టు అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిణితి సాధించా. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందాలంటే జట్టును బ్యాలెన్స్ చేసుకుంటూ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎవరైనా ఆటగాడు ఒత్తిడికి గురైతే.. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసి సంతోషంగా ఉండేలా చూడాలి. ఉదాహరణకు బౌలర్ విషయానికొస్తే.. అతడి బౌలింగ్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారనుకోండి.. అప్పుడు సదరు బౌలర్ కాస్త కోపం మీద ఉంటాడు. అందుకే ఆ సమయంలో కాకుండా పరిస్థితి చల్లబడిన తర్వాత నెమ్మదిగా మాట్లాడాలి. ఇదంతా నాయకత్వం వహించే స్థాయిని బట్టి ఉంటుంది. భారత టీ20 లీగ్‌లో అయితే ఎక్కువ మంది అంతర్జాతీయ ఆటగాళ్లే ఉంటారు. అదే రంజీ ట్రోఫీలో అయితే మరోలా ఆటగాళ్లతో వ్యవహరించాల్సి ఉంటుంది" అని పేర్కొన్నాడు.