Shikar Dhawan Latest Instagram Post : ఇటీవలే టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తన కుమారుడు జొరావర్ ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉన్నాడు. దీంతో ఆ చిన్నారిని శిఖర్ కలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా కుమారుడి బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా అకౌంట్లో తన కుమారుడిని ఉద్దేశించి ధావన్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'నిన్ను చూసి ఏడాదవుతోంది' అంటూ ఎమోషనలయ్యాడు.
గతంలో జొరావర్‌తో వీడియో కాల్ మాట్లాడిన సమయంలో తీసిన స్క్రీన్షాన్కు ఆయన షేర్ చేసి ఓ క్యాప్షన్‌ను రాశారు. "నిన్ను నేరుగా చూసి ఏడాది అవుతోంది. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలుగా నన్ను బ్లాక్ చేస్తున్నారు. కానీ, నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ టెలీపతితో ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగా నేను ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని నాకు బాగా తెలుసు. ఈ పాపా (నాన్న) ఎప్పుడూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాడు. నీ నవ్వు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. దేవుడి దయ వల్ల మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను. ధైర్యంగా ఉండు. దయ, వినయం, సహనంతో మెలుగు" అంటూ ధావన్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చదివిన అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. ధావన్‌కు సపోర్ట్ చేస్తున్నారు.
Shikar Dhawan Divorce News : తామిద్దరూ విడిపోతున్నట్లు రెండేళ్ల క్రితమే శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ ప్రకటించారు. తన భార్య అతడ్ని మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ దిల్లీలోని ఓ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని విచారంచిన కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.