Ravi Shastri on Yuvraj: టీ20 ప్రపంచకప్ ఆరంభ సీజన్ 2007లో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా లీగ్ స్టేజ్ ఆఖరి దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ (58; 16 బంతుల్లో 3x4, 7x6) రెచ్చిపోయి ఆడాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది జట్టు స్కోరును 200 దాటించాడు. అయితే, ఆరోజు వ్యాఖ్యాతగా ఉన్న టీమ్‌ఇండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తాజాగా ఓ కార్యక్రమంలో యువీ సిక్సర్లపై స్పందించాడు. ఆరోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకున్నాడు.
'2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నాకు గుర్తుంది. ఆరోజు ఆండ్రూ ఫ్లింటాప్, యువరాజ్ సింగ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అదే యువీని రెచ్చిపోయేలా చేసింది. తొలి బంతి సిక్సర్‌గా వెళ్లింది. రెండు, మూడు బంతులు కూడా అలాగే వెళ్లాయి. నాలుగో బంతి సైతం స్టాండ్స్‌లోకి వెళ్లింది. దీంతో నా పక్కనే ఉన్న డేవిడ్ లాయిడ్ కుర్చీ నుంచి లేచి గంతులేశాడు. అదే సమయంలో నేను కొట్టిన ఆరు సిక్సుల సంగతి గుర్తొచ్చింది. అప్పుడు బ్యాట్స్‌మన్, బౌలర్.. ఏం ఆలోచిస్తున్నారో అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఐదో బంతి కూడా సిక్సర్‌గా వెళ్లడంతో డేవిడ్ నన్ను కూడా కుర్చీలో నుంచి లేపాడు. దీంతో అప్పుడే యువరాజ్ ఆరో బంతిని కూడా సిక్సర్‌గా మల్చడానికి సిద్ధంగా ఉన్నాడని నేను కామెంట్రీలో చెప్పా' అని శాస్త్రి నాటి విశేషాల్ని నెమరువేసుకున్నాడు. 1985లో ఈ మాజీ ఆటగాడు కూడా రంజీ క్రికెట్‌లో ముంబయి తరఫున ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది అప్పట్లో సంచలనం సృష్టించాడు.