ప్రముఖ ఆటగాడు హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయలేకపోవడం వల్లే ఇంగ్లాండ్ పర్యటనకు అతడిని పక్కనపెట్టినట్లు చెప్పాడు టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ తానేంటో నిరూపించుకున్నాడని.. అందుకే హార్దిక్‌కు బదులు అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.
"హార్దిక్‌కు మించిన ఆటగాడిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అతడిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వెన్నుముక శస్త్రచికిత్స వల్ల బౌలింగ్ చేయలేకపోతున్నాడు. 2018లో అతడు చివరిసారిగా ఇంగ్లాండ్‌పై ఆడిన టెస్టు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏదేమైనప్పటికీ అతడిపై ఒత్తిడి తగ్గించి తిరిగి కోలుకునేలా చేయాలి. అతడికి ప్రత్యామ్నయంగా ఆల్రౌండర్లను సెలక్టరను గుర్తించడం పెద్దపని. ఆ తర్వాత వారిని మేం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. శార్దూల్ విషయానికొస్తే అతడు మంచి ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదగాలని పట్టుదలతో ఉన్నట్లు అంతకుముందు చెప్పాడు. జట్టుకు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఎంతో అవసరం. కాబట్టి అతడిని ఆ విధంగా తీర్చుదిద్దుతాం. ఇంగ్లాండ్ పర్యటనలో తన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని భావిస్తున్నాను"