Shane watson on virat kohli: మరో రెండు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఫామ్‌తో ఇబ్బంది పడుతూ ఆటకు విరామం తీసుకున్న టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ రాకపై ఐసీసీ రివ్యూ షోలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ప్రత్యేకంగా మాట్లాడాడు. కోహ్లీ మానసికంగా, శారీరకంగా నూతనోత్సాహంతో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. అయితే అడపాదడపా అర్ధశతకాలు సాధించినా తన స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయాడు. విండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరంగా ఉన్న కోహ్లీ విశ్రాంతి తీసుకుని ఆసియా కప్‌లో ఆడనుండటం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.
"భారత టీ20 లీగ్ గత సీజన్ సమయంలోనే కోహ్లీ తన శక్తిని కోల్పోయినట్లు అనిపించాడు. వరుసగా క్రికెట్ ఆడటం వల్ల చాలా అలసిపోయినట్లు కనిపించాడు. ఈ క్రమంలో నెల రోజులు ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ ఆసియా కప్‌లోకి దిగుతున్నాడు. మరో యాభై రోజుల్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందుకే విరాట్ వంటి నాణ్యమైన ఆటగాడు ఫామ్‌లోకి రావాలంటే తప్పనిసరిగా విశ్రాంతి అవసరం. అప్పుడే మరింత చురుగ్గా ఆడగలడు. ఫామ్ అందుకోవాలంటే కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఆసియా కప్‌లో రాణిస్తాడనే విశ్వాసం ఉంది" అని షేన్ వాట్సన్ వివరించాడు. ఆగస్ట్ 28న ఆసియా కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఆటకు విరామం తీసుకుని మైదానంలోకి అడుగు పెడుతున్న విరాట్ ఎలా ఆడతాడో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.