Shane Warne Death: లెగ్‌స్టంప్ ఆవల పడిన బంతి.. వైడ్ అవుతుందని బ్యాటర్ వదిలేస్తుంటాడు. మిగిలిన బౌలర్ల దగ్గర ఈ ఆట వర్కౌట్ అవుతుందేమో గానీ షేన్ వార్న్ విషయంలో కుదరదు. ఎందుకంటే ఆ బంతి ఒక్కసారిగా వికెట్ల మీదకు గింగిరాలు తిరుక్కుంటూ వచ్చేస్తుంది. క్షణాల్లో వికెట్లు పడగొట్టేస్తుంది. అదీ షేన్ వార్న్ స్పిన్ ప్రత్యేకత. ఇలాంటి మ్యాజిక్ బంతులతోనే షేన్ వార్న్ వన్డేల్లో 293, టెస్టుల్లో 708 వికెట్లు తీశాడు. అందులో అత్యుత్తమ ప్రదర్శనలు కొన్ని ఇవీ..
యాషెస్‌లోనే బెస్ట్ ఇచ్చాడు..
ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ అంటే.. ఏ రేంజ్‌లో హీట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వార్న్ అత్యుత్తమ ప్రద్శన కూడా ఇంగ్లండ్ జట్టు మీదే. 1994లో బ్రిస్బేన్‌లో జరిగిన యాషెస్ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 11 వికెట్లు తీశాడు వార్న్. దీంతో ఆ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనకుగాను వార్న్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
రెండో స్థానం పాకిస్థాన్‌కే..
షేన్ వార్న్ రెండో అత్యుత్తమ ప్రదర్శన అంటే... పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే అని చెప్పొచ్చు. 1995లో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులో వార్న్ ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల ప్రదర్శన ఇచ్చాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లూ కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16.1 ఓవర్లు బౌలింగ్ చేసిన షేన్ వార్న్ కేవలం 23 పరుగులే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫాలోఆన్ అడిన పాకిస్థాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి 240 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేసింది.
పెద్ద లక్ష్యం ముందు పెట్టి..
1990ల కాలంలో వన్డేల్లో 358 పరుగుల లక్ష్యం అంటే చాలా పెద్ద విషయమే. అందులోనూ షేన్ వార్న్ లాంటి మేటి స్పిన్నర్ ఉన్న జట్టు మీద బ్యాటింగ్ చేస్తూ ఆ స్కోరును అందుకోవడం ఇంకా కష్టం. 1992 మెల్‌బోర్న్ టెస్టులో వెస్టిండీస్‌పై షేన్ వార్న్ ఏడు వికెట్ల ప్రదర్శన ఇలాంటిదే. 358 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన విండీస్‌ను వార్న్ తన స్పిన్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ఏడు వికెట్ల తీసి ఆసీస్‌కు 139 పరుగుల విజయాన్ని అందించాడు.