"22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌కు కేవలం 10 మంది ఆటగాళ్లే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది నిజంగా విచారకరం. క్రీడల్లో పాకిస్థాన్ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతి ఒక్కరికీ ఇది సిగ్గుచేటు" అని పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ నుంచి 10 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుండడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. 2012 ఒలింపిక్స్‌కి.. ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో అద్దం పట్టే ఓ చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
తమ దేశంలో ప్రతిభకు కొదవలేదని నాజిర్ అభిప్రాయపడ్డాడు. కానీ, క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యత గల నాయకులు లేరని వ్యాఖ్యానించాడు. అలాగే చాలా మంది పాకిస్థాన్‌లో క్రీడలకు సంబంధించిన సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారన్నాడు. కానీ, ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించాడు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న ఒక ఆటగాడి వివరాలిస్తే ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశాడు.