SL Vs BAN Timed Out Controversy : 2023 వరల్డ్‌కప్ లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్ మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. ఇప్పుడీ వివాదం మరింత ముదురుతోంది. ఇరు జట్ల ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాథ్యూస్‌ను అంపైర్ టైమ్డ్ ఔట్‌గా ప్రకటించడం పట్ల బంగ్లా కెప్టెన్ షకీబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నేను యుద్ధంలో ఉన్నాను..'
ఈ విషయంపై మ్యాచ్ తర్వాత బంగ్లా కెప్టెన్ షకీబ్ స్పందించాడు. తాను యుద్ధంలో ఉన్నట్లు భావించానని.. అందుకే తనకు అనిపించింది తాను చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ విషయంపై ఎన్నో విమర్శలు వస్తాయని అవన్నీ తాను పట్టించుకోనని చెప్పాడు. అయితే తమ విజయానికి టైమ్డ్ ఔట్ సాయం చేసిందని తెలిపాడు. ఇందులో దాచడానికి ఏమీ లేదని షకీబ్ స్పష్టం చేశాడు.
'అది సిగ్గుచేటు..'
అయితే షకీబ్ చేసిన వ్యాఖ్యలకు మాథ్యూస్ కౌంటర్ ఇచ్చాడు. బంగ్లాదేశ్, ఆ టీమ్ కెప్టెన్‌కు ఇది సిగ్గు చేటు అని అన్నాడు. క్రికెట్ ఇలా ఆడాలని అనుకోవడం, దానికోసం ఇంతలా దిగజారడం చూస్తుంటే ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'నేను క్రీజులోకి రెండు నిమిషాల్లోపే వచ్చాను. హెల్మెట్ విరగడం చూసిన సమయంలోనూ ఇంకా ఐదు సెకన్ల టైమ్ మిగిలి ఉంది. ఇలాంటి సమయాల్లో కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. నేను మన్కడింగ్ లేదంటే ఫీల్డింగ్‌కు అడ్డంకిగా ఉండలేదు. కొంచెం కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే సరిపోయేది' అని మాథ్యూస్ అన్నాడు. ఆ తర్వాత తాను 5 సెకన్ల ముందే క్రీజులోకి వచ్చానని ట్వీట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి టైమ్ స్టాంప్ ఉన్న ఫొటోను జతచేశాడు.