Shakib Al Hasan World Cup 2023 : బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వరల్డ్‌కప్‌నకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎడమచేతి మధ్యవేలుకు గాయం కాగా.. ఆ గాయాన్ని తట్టుకుని మ్యాచ్ ఆడాడు. కానీ వాపు తీవ్రతరం కావడం వల్ల ఎక్స్‌రే తీయించగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో డాక్టర్లు అతన్ని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో షకీబ్ ఇంటికి వెళ్లాడు. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్‌కు మూడు నుంచి నాలుగు వారాల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్లు తెలిపారంటూ ఐసీసీ తాజాగా వెల్లడించింది.
ఇక షకీబ్ కెరీర్ విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్టార్ ప్లేయర్.. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆల్‌రౌండ్ మెరుపులతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇప్పటివరకు ఆడిన 66 టెస్టుల్లో 4454 పరుగులు చేయడంతో పాటు 233 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 7570 పరుగులు, 317 వికెట్లు సాధించాడు. 117 టీ20ల్లో 2382 పరుగులు, 140 వికెట్లు నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా, బంగ్లాదేశ్ తరపున కీలక ఆటగాడిగా తన పేరిట ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.
మరోవైపు సోమవారం జరిగిన మ్యాచ్ వల్ల వివాదంలోకి దిగాడు షకీబ్. శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయంలో అతడిపై విమర్శలు వస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా షకిబ్ ప్రవర్తించాడన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పైగా తాను యుద్ధంలో ఉన్నానని, జట్టు గెలుపు కోసం ఏమైనా చేస్తానని షకిబ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా చేసి దక్కించుకున్న విజయానికి విలువ ఉండదంటూ షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి.