Shakib Al Hasan Slapped Fan :బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ అభిమాని చెంప చెల్లుమనిపించి మరోసారి వార్తల్లో నిలిచాడు. సెల్ఫీ కోసం వెనుక నుంచి ఇబ్బందికి గురిచేసిన ఓ అభిమానిని కొట్టాడు. అయితే అభిమానిని షకీబ్ కొట్టిన తాజా ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.
బంగ్లాదేశ్‌లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఓటింగ్ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లిన షకీబ్ కోసం అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. అతడితో అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి, ముట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి తోపులాటగా మారింది. విసిగిపోయిన షకీబ్ కంట్రోల్ తప్పి ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. వెంటనే మిగిలిన అభిమానులు షకీబ్ నుంచి వెనక్కి వెళ్లారు.
అయితే షకీబ్‌కు వివాదాలు కొత్తేమి కాదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతడు ఎన్నోసార్లు విమర్శలపాలయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఏకంగా అంపైర్ల మీద విరుచుకుపడి సస్పెండ్‌కు కూడా గురయ్యాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచప్‌లో 'టైమ్డ్ ఔట్' అపీలు చేసినందుకు కూడా షకీబ్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. నిబంధనల ప్రకారమే షకీబ్ అపీలు చేసినప్పటికీ శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ అభ్యర్థించినా ఔట్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో వివాదాస్పదంగా మారింది. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించలేదని లంక ఫ్యాన్స్ తిట్టిపోశారు.
మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన షకీబ్ 1,85,388 ఓట్లతో భారీ విజయం సాధించాడు. అవామీ లీగ్ పార్టీ తరపున మగురా-1 స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. షకీబ్ సమీప ప్రత్యర్థి కాజీ రెజౌల్ హుస్సేన్ 45,993 ఓట్లు మాత్రమే సాధించాడు. కాగా, షకీబ్ పోటీచేసిన పార్టీ అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. మొత్తం 300 సీట్లకుగానూ 299 స్థానాలకు ఎన్నికలు జరగగా అవామీ లీగ్ 200 స్థానాలకుపైగా గెలుచుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు.