టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అలాగే పాక్ కూడా వరుసగా రెండో విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎటువంటి ఆటంకం రాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో జట్ల మధ్య మాత్రమే కాదు.. ఆటగాళ్ల మధ్య మంచి పోటీ ఉంటుంది. ఇంతకీ ఏఏ ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు ఉంటుందో చూద్దాం...
అఫ్రిది వర్సెస్ రోహిత్, రాహుల్.. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో షాహిన్ అఫ్రిది.. కేఎల్ రాహుల్, రోహిత్ వికెట్లను తీశాడు. తన ఇన్‌స్వింగర్స్‌తో ముప్పతిప్పలు పెట్టిన అఫ్రిది.. హిట్‌మ్యాన్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్‌ను 3 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ వికెట్ కూడా తీశాడు. మరి ఈసారి అఫ్రిది ఇన్‌స్వింగర్స్‌కు రాహుల్, రోహిత్‌లు ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి. అయితే మోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరమైన అఫ్రిది.. నేరుగా టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగాడు. మరి ఎలా ఆడతాడో చూడాలి.
బాబార్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వర్సెస్ భువనేశ్వర్.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్... ఆరంభ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇన్‌స్వింగ్‌తో ఎలాంటి బ్యాటర్లనైనా బెంబేలెత్తిస్తాడు. అందుకే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు భువీ సరైన బౌలర్ అని చెప్పొచ్చు. మరి వీరిని భువీ ఆడుకుంటాడా.. లేక భువీకే ఇద్దరు ఓపెనర్లు చెమటలు పట్టిస్తారా అనేది చూడాలి. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విధించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరే ఛేదించిన విషయం తెలిసిందే.