Washington sundar Zimbabwe tour అనుకున్నట్లే జరిగింది. టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయపడిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కాగా, ఇంగ్లాండ్ దేశవాళీ మ్యాచ్‌లాడుతున్న సుందర్.. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానం వీడాడు. తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి దిగలేదు. ఈ నేపథ్యంలోనే అతడి స్థానంలో జింబాబ్వే పర్యటనకు షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.
దీంతో 27 ఏళ్ల బెంగాల్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ జింబాబ్వే సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో షాబాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 41.64 సగటుతో 1041 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 2.64 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. 2019-20 రంజీ టోర్నమెంట్‌లో 500 పరుగులు చేయడమే గాక, 35 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. టీ20 మెగా టోర్నీలో 2020 నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.