భారత యువ సంచలనం షెఫాలీ వర్మతో పాటు ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా.. 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ రాణించారు. వీరితో పాటు ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకిల్స్టోన్నూ జూన్ నెలకుగానూ నామినేట్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి.
పొట్టి ఫార్మాట్లో అద్భుత ప్రదర్శనలతో టెస్టుల్లో, వన్డేల్లో చోటు సంపాదించిన షెఫాలీ.. అరంగేట్ర సిరీస్‌లోనే ఆకట్టుకుంది. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌పై జరిగిన ఏకైక టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఇరు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా, మొత్తంగా నాలుగో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక వన్డేల్లోనూ ఫర్వాలేదనిపించింది షెఫాలీ.
బ్రిస్టల్ టెస్టు డ్రా కావడంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక బంతితోనూ మెరిసిన రాణా నాలుగు వికెట్లతో రాణించింది.