ఏడేళ్ల నిరీక్షణ అనంతరం భారత మహిళల జట్టు తిరిగి టెస్టు క్రికెట్ ఆడబోతోంది. ఇంగ్లాండ్‌లో మెరుగైన గత రికార్డులతో పాటు ఆటగాళ్లలో సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ.. టెస్టుకు ముందు తగినంత ప్రాక్టీస్ లేకపోవడం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.
భారత్‌తో పాటు యూకేలో పలు క్వారంటైన్ల తర్వాత మిథాలీ సేన ఏకైక టెస్టు కోసం వేచి చూస్తోంది. చివరగా 2014 నవంబర్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆడింది టీమ్ఇండియా. మైసూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ టెస్టులో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. అప్పటి టీమ్‌లో ఉన్న సభ్యులలో ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉండడం పర్యాటక జట్టుకు సానుకూలాంశం.
ప్రాక్టీస్ మ్యాచ్ లేకపాయే..
కెప్టెన్ మిథాలీతో పాటు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామి.. ఇటీవల కాలంలో సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేదు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడని మిగిలిన క్రికెటర్లకూ ప్రస్తుత మ్యాచ్ కఠిన పరీక్ష లాంటిదనే చెప్పొచ్చు.
ఇదీ చదవండి:WTC Final: 'అలా అయితే టీమ్ఇండియానే విజేత'
ఇదే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పురుషుల జట్టు.. కనీసం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌తోనైనా ప్రాక్టీస్ చేయగలిగింది. కానీ, మహిళల జట్టుకు ఆ పరిస్థితి కూడా లేదు. వారు కేవలం నెట్ సెషన్లకే పరిమితమయ్యారు. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత పాల్గొనబోతున్న క్రికెటర్లకు నాలుగు రోజుల ఆటలో కొంత ఇబ్బంది కలగక తప్పదు.
"ప్లేయర్లు మంచి స్థితిలో ఉన్నారు. కావాల్సినంత శిక్షణ సమయం ఉంది. కానీ, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే బాగుండేది. అది వన్డే మ్యాచ్ అయినా నాలుగు రోజుల మ్యాచ్ అయినా. బౌలింగ్, బ్యాటింగ్‌ల్లో ఒత్తిడిని జయించాలంటే ప్రాక్టీస్ మ్యాచ్ అవసరం. ఇది టెస్టు కాబట్టి, వారు సుదీర్ఘ కాలం బ్యాటింగ్ చేయగల అవకాశం ఉందా? అదేవిధంగా బౌలింగ్‌తో పాటు వికెట్లు తీయగల సత్తా ఉందా? అనేది ప్రాక్టీస్ మ్యాచ్‌తో రూఢీ అవుతుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
ఏకైక టెస్టు మ్యాచ్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడానికి సమయం తక్కువ ఉన్నప్పటికీ.. తాము మానసికంగా ఎప్పుడో ప్రిపేర్ అయ్యామని తెలిపింది. కొన్ని విలువైన సూచనలను టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రహానె నుంచి తెలుసుకున్నట్లు వెల్లడించింది.
షెఫాలీకి మంచి అవకాశం..
మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న యువ ఓపెనర్ షెఫాలీ వర్మకు ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. ఆమె ఆట టాపార్డర్‌పై ప్రభావం చూపుతుందనడంలో సందేహమే లేదు. ఇక అనుభవ త్రయం మిథాలీ, హర్మన్‌ప్రీత్, పూనమ్ రౌత్.. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో తమ వంతు పాత్ర పోషించాలి. బౌలర్లు జులాన్ గోస్వామి, శిఖా పాండే సుదీర్ఘ స్పెల్‌లు వేయగలరా లేదా అనేది చూడాలి. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో స్వదేశంలో రాణించిన స్పిన్నర్లు ఎంత మేరకు రాణిస్తారో చూడాలి.