Senanayake Arrest: శ్రీలంకమాజీ ఆటగాడు సచిత్ర సేననాయకే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. బుధవారం శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తు బృందానికి లొంగిపోయాడు. అనంతరం దర్యాప్తు బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇదివరకే దర్యాప్తు ప్రారంభించిన కొలంబో కోర్టు.. మూడు వారాల కిందటే దేశాన్ని విడిచి వెళ్లరాదంటూ అతడ్ని ఆదేశించింది. ఇక 15 రోజుల పాటు సేననాయకె పోలీసుల అదుపులో ఉంటాడు.
ఇదీ కేసు..2020 లంక ప్రీమియర్ లీగ్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సేననాయకేపై ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో సేననాయకే.. నిబంధనలకు విరుద్ధంగా సంప్రదింపులు జరిపాడని అతడిపై ఉన్న ప్రధాన ఆరోపణ. 38 ఏళ్ల సేననాయకె 2012-2016 మధ్య కాలం శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Senanayake International Career: అతడి కెరీర్లో ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 53 వికెట్లు నేలకూల్చిన సేననాయకె, టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇక 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 8 మ్యాచ్‌లు ఆడిన సేననాయకె.. 9 వికెట్లు తీశాడు. శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో సేననాయకె బస్నహిరా గ్రీన్స్, వెస్టర్న్ ట్రూపర్స్ జట్ల తరఫున ఆడాడు.