T20 World Cup Semi Finals: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి చొప్పున నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకొంటాయి. సూపర్ -12 దశలోని గ్రూప్ - 1 పరిస్థితి తెలిసిందే కదా.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. టీమ్‌ఇండియా ఉన్న గ్రూప్ - 2లోని సెమీస్ సమీకరణాలు కూడా ఉత్కంఠగా మారాయి. తాజాగా బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ గ్రూప్‌లో నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లకు అవకాశాలు లేవు. మరి ఏ జట్లకు.. ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఓసారి చూద్దాం..
టీమ్‌ఇండియా (6 పాయింట్లు) : భారత్ ఐదు మ్యాచ్‌లకుగాను నాలుగు ఆడేసింది. అందులో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లు సాధించింది. ఇక చివరి మ్యాచ్‌లో జింబాబ్వేతో నవంబర్ 6న తలపడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా సెమీస్ బెర్తును ఖాయం చేసుకొంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం.. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే సూపర్ -12 దశలో భారత్-జింబాబ్వే మ్యాచ్ చివరి కావడం గమనార్హం.
దక్షిణాఫ్రికా (5 పాయింట్లు): మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక రద్దు వల్ల 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా అవకాశాలు ఉన్న ఏకైక జట్టు దక్షిణాఫ్రికానే. మిగిలిన రెండు మ్యాచుల్లో పాక్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఒక్క మ్యాచ్ గెలిచినా.. అప్పుడు ఏడు పాయింట్లతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకొంటుంది. రెండు మ్యాచుల్లో ఓడితే మాత్రం ఇతర జట్లపై ఆధారపడే పరిస్థితి తెచ్చుకున్నట్లే.
బంగ్లాదేశ్ (4 పాయింట్లు): రెండు విజయాలు, రెండు ఓటములతో 4 పాయింట్లు కలిగి ఉన్న బంగ్లాదేశ్ తన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. బంగ్లా ఇంటిముఖం పట్టినట్టే. ఒకవేళ బంగ్లాదేశ్ విజయం సాధిస్తే మాత్రం.. ఇతర జట్ల ఫలితంపైనే తమ అవకాశాలు ఆధారపడి ఉంటుంది.
పాకిస్థాన్ (2 పాయింట్లు): సెమీస్ అవకాశాలు ఉన్న జట్లలో చిట్టచివరన ఉన్న టీమ్ పాక్. ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం, రెండు ఓటములతో కేవలం 2 పాయింట్లను మాత్రమే దక్కించుకొంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాక్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే పాక్ ఆరు పాయింట్లు సాధిస్తుంది. అయితే దక్షిణాఫ్రికా పాక్‌పైనే కాకుండా.. నెదర్లాండ్స్ చేతిలోనూ ఓటమిపాలైతేనే పాక్ సెమీస్ బెర్తును దక్కించుకొనే అవకాశం ఉంది. నవంబర్ 3న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఓడితే మాత్రం అప్పుడే పాక్ కథ ముగిసిపోతుంది.
జింబాబ్వే (3), నెదర్లాండ్స్ (2): భారత్‌తో జింబాబ్వే.. దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచుల్లో తలపడతాయి. ఈ రెండు జట్లకూ సెమీస్ అవకాశాలు లేనేలేవు. అయితే తమ ప్రత్యర్థి జట్ల ఫలితాలను మాత్రం తారుమారు చేయగల ఛాన్స్ మాత్రం వీటికి ఉంది. టీ20 ప్రపంచకప్ సూపర్ -12 దశలోనే చివరి మ్యాచ్ భారత్ - జింబాబ్వే మధ్య జరగనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం కాబట్టి.. పసికూనల అనుకొంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్‌పై జింబాబ్వే విజయం సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరి చివర్లో కూడా ఏదైనా సంచలనం జరుగుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.