బాల్ ట్యాంపరింగ్ విషయం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్, వార్నర్‌తో పాటు బౌలర్లందరికీ ముందే తెలుసని నాటి వివాదంపై ఇప్పుడు నోరు విప్పాడు ఈ ఘటనలోని ప్రధాన సూత్రధారి, ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో జరిగిన ఈ సంఘటన.. క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనలో బాన్‌క్రాఫ్ట్‌తో(9 నెలలు) పాటు స్మిత్, వార్నర్‌పై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడీ విషయాన్ని అంగీకరించాడు. అయితే, ఆ వివాదంలో తానొక్కడే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు.
"కచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను చేసిన పని బౌలర్లకు ఉపకరిస్తుంది. దాని గురించి వాళ్లకంతా అవగాహన ఉంది. వివరంగా చెప్పాల్సిన పనిలేదు. బాల్ టాంపరింగ్ విషయంలో నేను చాలా లోతుల్లోకి వెళ్లాను. నా విలువలన్నీ మర్చిపోయాను. మా జట్టులో అందరితో ప్రశంసలు పొందాలనే ఉద్దేశం నన్ను బలంగా ఈ పని చేయించింది. జట్టులో నేనొక ముఖ్యమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం నాలో కలిగింది. సాండ్ పేపర్‌ను బంతికి రుద్ది జట్టుకు ఉపయోగంగా మారాలని అనుకున్నా. అది జరిగాక కానీ నేను చేసింది తప్పని తెలుసుకోలేకపోయాను. క్రికెటర్‌గా నా ప్రయాణంలో అది కూడా ఒక భాగమని చెప్పొచ్చు. అది నేను నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠం. అది తప్పని తెలిస్తే ముందే వేరే నిర్ణయం తీసుకునేవాడిని" అని బాన్‌క్రాఫ్ట్ అన్నాడు.
ఇదీ చూడండి:'జట్టును కాపాడేందుకే స్మిత్ అలా చేశాడు'