వెస్టిండీస్- ఆస్ట్రేలియా (AUS vs WI 2nd ODI 2021) మధ్య జరగాల్సిన రెండో వన్డేలో కొవిడ్ కలకలం రేపింది. దీంతో మ్యాచ్ వాయిదా పడింది. విండీస్ క్యాంపులోని ఆటతో సంబంధం లేని ఓ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
ఈ విషయం టాస్ వేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో కొవిడ్ నిబంధనల ప్రకారం ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. వారందరికీ మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించనున్నారు. ఆటగాళ్ల కొవిడ్ రిపోర్టులు వచ్చిన తర్వాత మ్యాచ్ నిర్వహణ తేదీని ప్రకటించనున్నారు. అంతవరకు వారు హోటల్ గదులకే పరిమితం కానున్నారు.
సందిగ్ధంలో బంగ్లా టూర్.!
టీ20 ప్రంపచకప్‌కు ముందు సన్నాహాక మ్యాచ్‌ల్లో భాగంగా పలు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది ఆస్ట్రేలియా. ఈ సిరీస్ అనంతరం బంగ్లాలో పర్యటించనుంది. ఆగస్టు 3 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జులై 29న అక్కడికి చేరుకోనుంది. ప్రస్తుతం కొవిడ్ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో వారు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సిరీస్ ఆడతారో లేదో!
కరీబియన్ల చేతిలో టీ20 సిరీస్‌ను 1-4తో కోల్పోయిన ఆసీస్.. వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం రెండో వన్డే వాయిదా పడింది. ఇక చివరిదైన మూడో మ్యాచ్ జులై 24(శనివారం) జరగాల్సి ఉంది. కరోనా కేసు వెలుగు చూసిన నేపథ్యంలో అది కూడా సజావుగా సాగుతుందో లేదో చూడాలి.
ఇదీ చదవండి:IND vs SL: క్లీన్‌స్వీప్‌పై గబ్బర్‌సేన గురి!