Asia Cup India vs Pakistan: పాకిస్థాన్‌తో మ్యాచ్ వేళ జాగ్రత్తగా ఉండాలంటూ న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ టీమ్‌ఇండియాను హెచ్చరించాడు. చివరిసారి ఈ రెండు జట్లు పోటీపడ్డ ఆ స్టేడియంలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడమే ఇందుకు కారణం. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. ఈ దాయాది జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పోటీ పడగా.. టీమ్‌ఇండియా చిత్తుగా ఓడింది. ఆపై న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
ఈ నేపథ్యంలోనే స్కాట్ స్టైరిస్ ఓ క్రీడా ఛానెల్‌లో నిర్వహించే 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్' కార్యక్రమంలో మాట్లాడాడు. నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని రోహిత్ సేనను హెచ్చరించాడు. అప్పుడు టీమ్‌ఇండియా తమను తాము ఒత్తిడిలోకి నెట్టుకుందని, ఇప్పుడు అలాంటి దశలోకి వెళ్లకూడదని సూచించాడు. దూకుడుగా ఆడాలన్నాడు. 'పటిష్టమైన టీ20 జట్టు టీమ్‌ఇండియా సొంతం. అందుకే వారు తమ బలాలకు తగినట్లు ఆడాలని కోరుకుంటున్నా. నాడు పాక్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ ఈ విషయాన్ని మర్చిపోయి, తమను తాము నియంత్రించుకోవడం వల్లే మూల్యం చెల్లించుకుందని భావిస్తున్నా' అని స్టైరిస్ అన్నాడు.
'ఎంతో నైపుణ్యం గల భారత జట్టు తమపై ఒత్తిడి పెంచుకొని మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ లోపాన్ని అధిగమిస్తూ ఆ జట్టు ఆసియా కప్‌లో రాణించాలని భావిస్తున్నా. తమ ప్రతిభతో పాకిస్థాన్‌తోపాటు తాము ఎదుర్కొనే ఇతర జట్లపైనా ఒత్తిడి పెంచాలని కోరుకుంటున్నా' అని వ్యాఖ్యానించాడు. కానీ, వారు తమ శక్తిని తాము తగ్గించుకొని ఆడితే మాత్రం తాను కోరుకున్నట్లుగా జరగకపోవచ్చని, ఇలాంటి పరిస్థితులు ఉంటే పాకిస్థాన్ పైచేయి సాధించే అవకాశాలున్నాయని కివీస్ మాజీ స్పిన్నర్ పేర్కొన్నాడు.