Satya Nadella On India World Cup Loss: ఆదివారం జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో సత్య నాదెళ్ల మాట్లాడుతుండగా.. షో హోస్ట్ వరల్డ్ కప్ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత టీమ్ఇండియా ఓటమిని గుర్తుచేసి.. ఆ ఓటమికి ప్రతీకారంగా 'ఆస్ట్రేలియాను కొంటారా?' అని సరదాగా ప్రశ్నించారు. దీనిపై సత్య నాదెళ్ల స్పందించారు. ఆస్ట్రేలియాను కొనడం అంటే ఓపెన్‌ఏ ఐను సొంతం చేసుకోవడం లాంటిదేనని.. ఆ రెండూ సాధ్యం కావని నవ్వుతూ బదులిచ్చారు. కానీ, ఓపెన్ ఏఐతో తాము భాగస్వాములం కాగలమని అన్నారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ ఆడడాన్నీ ఆనందించగలమని అని సరదాగా బదులిచ్చారు.
అయితే సత్య నాదెళ్ల క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వ్యక్తం చేశారు. 2023 వరల్డ్ కప్‌లో భాగంగా గత బుధవారం న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు తెలిపారు.
అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను సైతం సత్య నాదెళ్ల వీక్షించారు. ఆస్ట్రేలియా విజయం ఖరారు కాగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఎంతో శ్రమించి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టును కూడా అభినందించారు. క్రికెట్ గురించి పలు సందర్భాల్లో నాదెళ్ల గతంలో ప్రస్తావించారు. ఈ ఆటే తనకు టీమ్‌లో కలిసి పనిచేయడాన్ని, నాయకత్వాన్ని నేర్పించిందని మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన సమయంలో చెప్పారు.