Sarfaraz Khan Teamindia : టీమ్‌ఇండియా ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్న పేరు. నిలకడగా రాణిస్తున్న ఈ స్టార్ప ప్లేయర్.. భారత టెస్టు జట్టులో చోటు దక్కకపోవడం వల్ల ఈ 25 ఏళ్ల ముంబయి బ్యాటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. శతకాల మీద శతకాలు బాదుతూ.. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ బీసీసీఐ అవేం పట్టించుకోకుండా.. వెస్టిండీస్‌తో టెస్టులకు అతనికి సెలక్టర్లు మొండిచెయ్యే చూపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌తో పాటు సహా మాజీలు బీసీసీఐతో పాటు సెలక్టర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుననారు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకోకపోవడానికి గల ఆటేతర కారణాలను ఒక్కొటిగా బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లుగా సర్ఫరాజ్ ఖాన్‌కు ఫిట్‌నెస్ లేదని.. అతని ప్రవర్తన కూడా సరిగ్గా లేదని.. అందుకే జట్టులో సర్ఫరాజ్‌కు చోటు దక్కలేదని ఓ బీసీసీఐ ప్రతినిధి వెల్లడించాడు. అయితే ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.
ప్రదర్శన పట్టించుకోరా?
Sarfaraz Stats : బీసీసీఐ వర్గాల వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ విషయంపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అంటే 'జట్టులోకి ఎంపిక చేయడానికి ఆటగాడి ప్రదర్శనను పట్టించుకోరా?'.. 'ఓ సెలక్టర్‌కు వేలు చూపించాడని జట్టుకు ఎంపిక చేయలేదంటే.. అలాంటి కారణాలతో అతన్ని పక్కన పెట్టడం సమంజసమేనా'... ;దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టులో ఎంపికకు ప్రదర్శన ప్రామాణికం కాదా'.. అని మాజీలు మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. 'ఆటేతర కారణాలు చెప్పి గత మూడు రంజీ సీజన్లలో కలిపి 2,466 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ను పట్టించుకోకపోవడం సరైన పద్దతేనా'.. 'ఇలాంటి చర్యల వల్ల అతని ఆత్మస్థైర్యం దెబ్బతిని కెరీర్ నాశనమైతే ఎవరు బాధ్యత వహిస్తారు' అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
మరోవైపు సీనియర్ ప్లేయర్ సునీల్ గావస్కర్ చెప్పినట్లు తుది పదకొండు మందిలో కాకపోయినా జట్టులో చోటిచ్చి ఉండాల్సింది. ఈ రోజుల్లో యువ ఆటగాళ్లందరూ దూకుడుగానే ఆడుతున్నారు. శతకం చేసినప్పుడు ఓ స్థాయిలోనే సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ సైతం సెంచరీ చేసినా.. వికెట్ పడినా హద్దులు దాటే సంబరాలు చేసుకుంటాడు. గత సీజన్‌లో దిల్లీతో మ్యాచ్‌లోనూ శతకం తర్వాత సర్ఫరాజ్ కూడా అలాగే చేశాడన్నది అతడి మద్దతుదారుల వాదన.
ఫిట్‌నెస్ లేదా?
Sarfaraz Fitness : సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి మరో కారణం ఫిట్‌నెస్ లేకపోవడమట! కానీ ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన 'యోయో టెస్టు'లో అతను 16.5 స్కోరు సాధించాడని సమాచారం. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఫిట్‌నెస్ ప్రమాణాలు కూడా అదే స్థాయిలోనే ఉన్నాయి. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ రెండు రోజులు బ్యాటింగ్ చేయడంతో పాటు మరో రెండు రోజులు ఫీల్డింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతని ఫిట్‌నెస్ మెరుగ్గానే ఉందని చెప్పడానికి ఇవి చాలవా ? భారత జట్టులో ఎంతోమంది తరచుగా గాయాల పాలవుతూ.. నెలలకు నెలలు ఆటకు ఎలా దూరమవుతున్నారో చూస్తున్నాం. జట్టులో కొనసాగుతున్న కొందరు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా ఇంకా సందేహాలున్నాయి. అలాంటిది అవకాశం ఇవ్వకుండానే సర్ఫరాజ్ ఫిట్‌నెస్ మీద సందేహాలు వ్యక్తం చేయడం విడ్డూరం అని క్రికెట్ లవర్స్ అంటున్నారు. ఇటీవల కాలంలో కుర్రాళ్లకు బీసీసీఐ బాగానే అవకాశాలిస్తోంది. అందులో భాగంగానే వెస్టిండీస్‌తో టెస్టులకు యశస్వి, రుతురాజ్‌ను తొలిసారి జట్టుకు ఎంపిక చేసింది. ఇక సర్ఫరాజ్‌ను కాదని రుతురాజ్‌ను తీసుకోవడంలోనూ ఆంతర్యం ఏమిటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రుతురాజ్ 28 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 42.19 సగటుతో 6 శతకాలతో సహా 1941 పరుగులు చేశాడు. అయితే సర్ఫరాజ్ 37 మ్యాచ్‌ల్లో 79.65 సగటుతో 3505 పరుగులను సాధించాడు. ఇందులో 13 సెంచరీలున్నాయి. దీంతో ఐపీఎల్ ప్రదర్శనతోనే రుతురాజ్‌ను ఎంపిక చేశారా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అలాంటప్పుడు గావస్కర్ అన్నట్లు.. ఇక రంజీ ట్రోఫీ నిర్వహించి ఏం లాభం? ఐపీఎల్‌లో ఉత్తమంగా ఆడితే చాలు టెస్టుల్లోకి కూడా తీసుకుంటామనడానికి ఇది ఓ సంకేతమా? రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్ ఆడటమే మేలని మరో మాజీ ఆటగాడు అభినవ్ ముకుంద్ కూడా ఇటీవలే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ లాంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల పట్ల బీసీసీఐ వైఖరి మారాల్సిందేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే ?
Sarfaraz Ranji Matches : దిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో శతకాన్ని బాదిన సర్ఫరాజ్.. ఆ తర్వాత తొడగొట్టి, ఓ బీసీసీఐ సెలక్టర్ వైపు వేలు చూపిస్తూ.. వెక్కిరించేలా సంబరాలు చేసుకున్నాడని.. అయితే బీసీసీఐ వర్గాలు చేసిన ఈ వ్యాఖ్యల్లో నిజం లేదని, అతనెప్పుడూ అగౌరవపరిచేలా ప్రవర్తించ లేదని సర్ఫరాజ్ సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
"దిల్లీతో రంజీ మ్యాచ్‌లో శతకం తర్వాత తన సహచర ఆటగాళ్లు, కోచ్ అమోల్ మజుందార్ (తన టోపీ తీసి అభివాదం చేశాడు) వైపు చూస్తూ సర్ఫరాజ్ సంబరాలు చేసుకున్నాడు. అప్పుడు అక్కడున్న సెలక్టర్ చేతన్ శర్మ కాదు సలీల్ అంకోలా. తీవ్ర ఒత్తిడి పరిస్థితులను నుంచి జట్టును బయటపడేసిన సర్ఫరాజ్ ఉపశమనం కోసం అలా సంబరాలు చేసుకోవడం కూడా తప్పేనా? అది కూడా సొంత డ్రెస్సింగ్ గది వైపు చూస్తూ అతనలా చేశాడు. మరోవైపు సర్ఫరాజ్ ప్రవర్తన పట్ల మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ చిరాకు పడ్డారన్నది కూడా వాస్తవం కాదు. సర్ఫరాజ్‌ను అతను ఓ తనయుడిలా భావిస్తాడు. 14 ఏళ్ల వయసు నుంచి అతని గురించి చంద్రకాంత్‌కు బాగా తెలుసు. ఇప్పటివరకు అతనెప్పుడూ సర్ఫరాజ్‌పై కోప్పడలేదు" అని సర్ఫరాజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.