భారత్, ఆసీస్ మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ) ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం శుక్రవారం సెలక్టర్లు 17 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించారు. యువ ఆటగాడు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌కు మొదటిసారి టెస్టు జట్టులోకి పిలుపొచ్చింది. అయితే, ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు బదులు రంజీల్లో రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. సర్పరాజ్ ఖాన్ గత రెండు రంజీ సీజన్లలో సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. 2019-20 సీజన్‌లో 928 పరుగులు, 2021-22లో 982 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ (2022-23) సీజన్‌లో 25 ఏళ్ల సర్ఫరాజ్ 5, 126*, 75, 20, 162, 15*, 28* పరుగులతో మంచి ప్రదర్శన కనబరిచాడు.
'టెస్టు జట్టులో పలు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకున్నా. జాతీయ జట్టులోకి రావడానికి అతడు చేయాల్సిందంతా చేశాడు' అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. 'మీరు సూర్యకుమార్‌ను ఎంపిక చేశారు అంటే జట్టులో ఒక స్థానం ఖాళీగా ఉందని అర్థం. నా అభిప్రాయం ప్రకారం.. సర్ఫరాజ్‌కు ఆ అవకాశం లభించి ఉండాల్సింది. ఎందుకంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ సగటు 80. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ కంటే ముందు బ్రాడ్‌మన్ మాత్రమే 80 లేదా అంతకంటే ఎక్కువ సగటుతో ఉన్నాడు. భారత జట్టులోకి రావడానికి సర్ఫరాజ్ తన శక్తి మేరకు కృషి చేశాడు. మీకు ఒక వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉంటే.. నా అభిప్రాయం ప్రకారం ఆ అర్హత సర్ఫరాజ్ ఖాన్‌కే ఉంది. ఎవరైనా ఆటగాడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తే అతడికి తగిన గుర్తింపునివ్వాలి' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.