Sanju Samson Chenanai Super Kings : ఐపీఎల్-2024 మిని వేలంకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే వీటిపై ఆయా స్టార్ ఆటగాళ్లు స్పందించని తరుణంలో నెటిజన్లు అవే నిజమనుకుని నమ్ముతున్నారు. తాజాగా సంజూ శాంసన్ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా ఈ రాజస్థాన్ ప్లేయర్ గురించి నెట్టింట ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంజూకు కెప్టెన్సీకి సంబంధించిన ఆ వార్తలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. త్వరలో సంజూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ న్యూస్ సారంశం. అయితే ఈ విషయాన్ని వెటెరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడంటూ ఓ యూజర్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
"తమ కెప్టెన్‌గా రావాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.. సంజూ శాంసన్‌కు భారీ ఆఫర్ ఇచ్చింది. అందుకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. అయితే సంజూ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. కానీ భవిష్యత్తులో మాత్రం సంజూను సీఎస్‌కే కెప్టెన్‌గా చూడటం ఖాయం" అని అశ్విన్ చెప్పినట్లు ఆ ట్వీట్లో రాసుంది. అయితే అవన్ని నిజం కావంటూ అశ్విన్ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. "ఇవన్నీ అసత్యపు వార్తలు. అబద్ధాల ప్రచారానికి నా పేరును వాడకండి" అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఇదే విషయంపై సంజూ ఫ్యాన్స్ కూడా నెట్టింట కామెంట్లు పెడుతున్నారు."రాయల్స్‌ను విజయపథంలో నడిపిస్తున్న సంజూకు ఆ జట్టును వీడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతడు ధోని వారసుడిగా చెన్నై జట్టుకు కెప్టెన్ అవ్వాలనుకుంటే అందులో తప్పేం లేదు" అని కామెంట్లు చేస్తున్నారు.