Sanjay Manjrekar On Indian Cricket Team : ఆసియా కప్ సూపర్-4 తొలి పోరులో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి భారత ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌తోపాటు మూడో సీమర్‌గా హార్దిక్ పాండ్య బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. అయితే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌పైనే హార్దిక్ (3/25) సూపర్‌గా బౌలింగ్ వేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యను నమ్మకమైన మూడో పేసర్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే సంజయ్ మంజ్రేకర్ మాత్రం హార్దిక్‌ను మూడో పేసర్‌గా కాకుండా.. నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించాడు.
"పాక్‌తో మ్యాచ్ నుంచి చాలా పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాచ్ సందర్భంగా రోహిత్‌కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒకవేళ మేనేజ్‌మెంట్ ముగ్గురు మీడియం పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే.. ఆ ముగ్గురిలో హార్దిక్ పాండ్యను లెక్కలోకి తీసుకోకూడదు. హార్దిక్ పాండ్య గొప్ప బౌలరే అయినప్పటికీ నాలుగో సీమర్‌గానే పరిగణించాలి. ఎందుకంటే హార్దిక్ బౌలర్‌గా విఫలమైనప్పుడు ఆ ఓవర్ల కోటాను వేరే బౌలర్ పంచుకునే అవకాశం కల్పించాలి. లేకపోతే పాక్‌తో జరిగినట్లే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. బౌలింగ్ సరిగా లేనప్పుడు హార్దిక్‌ను రెండు ఓవర్లతోనే ఆపేయాలి. అప్పుడు జట్టుకూ, అతడికి ప్రయోజనం ఉంటుంది"అని మంజ్రేకర్ వివరించాడు. సూపర్-4లో భాగంగా ఇవాళ శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పటికే అఫ్గాన్‌పై విజయం సాధించిన లంకను ఎదుర్కోవడం తేలికైన విషయమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.