అనుకున్నదే జరిగింది! వేర్వేరు శిబిరాల్లో బస చేస్తున్న శ్రీలంక క్రికెటర్లలో ఒకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతడితో కలిసున్న వారినీ ప్రత్యేకంగా ఉంచారని తెలిసింది.
శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను లంక బోర్డు రెండు శిబిరాల్లో ఉంచి సాధన చేయిస్తోంది. కొలంబోలో ఉంటున్న బ్యాట్స్‌మన్ సందున్ వీరక్కోడికి పాజిటివ్ వచ్చినట్టు తాజాగా తెలిసింది.
సిన్నామన్ గ్రాండ్ హోటల్లో వీరక్కోడి మరో 15 మంది సీనియర్ క్రికెటర్లతో కలిసి బస చేశాడని శ్రీలంక క్రికెట్ వర్గాలు స్థానిక న్యూస్‌వైర్‌కు తెలిపాయి. ఆసక్తికర విషయం ఏంటంటే టీమ్‌ఇండియాతో సిరీసుకు ముందు సాధన మ్యాచులు ఆడించేందుకు కొందరు క్రికెటర్లను ఎస్‌ఎల్‌సీ శుక్రవారం రాత్రి డంబుల్లా పంపించింది. అందులో వీరక్కోడి, భనుక రాజపక్స సహా మరికొందరు ఉన్నారు.
డంబుల్లాలోని ప్రత్యేక బయో బడుగలో 26 మంది క్రికెటర్లు ఉన్నారు. వారంతా బాగానే ఉన్నారని శ్రీలంక క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వీరక్కోడి ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చిన జట్టులో సభ్యుడు కాకపోవడం గమనార్హం. బ్యాటింగ్ కోచ్‌కు కరోనా రావడం వల్ల వారు ఇప్పటికీ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన బయో బుడగలో 13 మంది ఆటగాళ్లు ఉన్నారు.
ఇదీ చదవండి:హర్లీన్ కౌర్ అద్భుత క్యాచ్‌పై దిగ్గజాల ప్రశంసలు