మూడేళ్ల కింద జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఇప్పుడు మరోసారి కుదిపేస్తోంది. నాటి ప్రధాన సూత్రధారి కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా తాను బంతికి ఉప్పుకాగితం రాయడం తమ బౌలర్లకు కూడా ముందే తెలుసన్నాడు బాన్‌క్రాఫ్ట్. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు మరోసారి దానిపై విచారణ చేపట్టింది. అయితే, ఈ విషయంపై ఇంకా ఏదైనా కొత్త సమాచారం ఉంటే తెలియజేయాలని తమ ఆటగాళ్లను కోరింది.
మరోవైపు ఈ ఉదంతం జరిగిన సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేయగా.. ప్రధాన సూత్రధారి కామెరూన్‌ను తొమ్మిది నెలల పాటు ఆటకు దూరం చేసింది. అయితే, ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్‌స్కైన్ తాజాగా విమర్శించాడు. ఆ ముగ్గురికీ శిక్ష వేసినప్పుడు.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కేసు గెలిచేవారన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో విచారణ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లందర్నీ విచారించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని జేమ్స్ అభిప్రాయపడ్డాడు.