Sandeep Lamichhane Rape Case:మైనర్‌పై అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్కు ఆ దేశ కోర్టు 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. బుధవారం విచారణ చేపట్టిన శిషిర్ రాజ్ ధఖల్ ధర్మాసం, సందీప్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్షతోపాటు, జరిమానా కూడా విధించిందని నేపాల్ కోర్టు అధికారి రాము శర్మ తెలిపారు. 2022 ఆగస్టులో కాఠ్ మాండూలోని ఓ హోటల్లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించగా, తాజాగా తీర్పు వచ్చింది.
ఇదీ కేసు: 2022 ఆగస్టు 21న కాఠ్ మాండూ, భక్తపూర్లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాఠ్ మాండు సినమంగల్‌లోని ఓ హోటల్‌కు తీసుకొచ్చి అక్కడే అత్యాచారం చేసినట్లు నేపాల్‌కు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ ఆరోపించింది. అతడిపై అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నేపాల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్‌పై వేటు వేసింది.
ఇక గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ పూర్తి చేసుకొని నేపాల్‌కు తిరిగి వచ్చిన సందీప్‌ను పోలీసులు ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్‌లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు. కాగా, రీసెంట్గా సందీప్‌ను దోషీగా తేల్చిన నేపాల్ కోర్టు బుధవారం ఈ తీర్పును వెలువరించింది.