Samiur Rahman brain tumour: బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ తొలి వన్డే టీమ్‌లో సభ్యుడైన సమియుర్ రెహ్మాన్(69).. ఢాకాలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ ట్యూమర్‌తో పాటు డెమెంటియా అనే వ్యాధితో బాధపడుతున్న రెహ్మాన్.. నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి క్రమంగా దిగజారడం వల్ల.. మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. 1986లో ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్నారు రెహ్మాన్. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు బంగ్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు. బౌలర్‌గా ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత అంపైర్‌గానూ సేవలు అందించారు.
Mosharraf Hossain death: మరోవైపు, బంగ్లా మాజీ ఆటగాడు మొషరఫ్ హొస్సెన్(40) సైతం బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు మొషరఫ్. సింగపూర్, భారత్ వంటి దేశాల్లోని ప్రముఖ ఆస్పత్రులలో చికిత్స తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆరోగ్యం క్షీణించి మరణించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన మొషరఫ్.. బంగ్లా తరఫున ఐదు అంతర్జాతీయ వన్డేలు ఆడారు. కాగా, దేశవాళీలో మొత్తం 572 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ జాతీయ స్థాయిలో అరుదైన రికార్డులు ఆయన పేరిట ఉన్నాయి.