తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బాబర్.. నీ ప్రణాళికేంటో అర్థం కావడం లేదు' - babar azam news

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) వార్మప్​ మ్యాచ్​ల్లో భాగంగా పాకిస్థాన్​ సారథి బాబర్ ఆజామ్ నిర్ణయాలను తప్పుపట్టాడు ఆ జట్టు మాజీ ఆటగాడు సల్మాన్ బట్(Salman Butt). ఆటగాళ్లను ఉపయోగించడం బాబర్​కు తెలియట్లేదని అన్నాడు. బాబర్​పై మండిపడుతూ.. టీమ్​ఇండియాను కొనియాడటం గమనార్హం.

pakisthan team
పాకిస్థాన్ జట్టు

By

Published : Oct 21, 2021, 6:16 PM IST

పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌(T20 World Cup Pak Team 2021) జట్టుపై ఆ టీమ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌(Salman Butt News) మండిపడ్డాడు. వార్మప్‌ మ్యాచ్‌ల్లో యువకులకు, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రధాన ఆటగాళ్లు ఆడటం ఏమిటని నిలదీశాడు. ఈ సందర్భంగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(Babar Azam News) ప్రణాళికలు అర్ధంకావడం లేదన్నాడు. ఇలా చేయడం వల్ల పాకిస్థాన్‌ జట్టు అభద్రతాభావంలో ఉందనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సల్మాన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ పాక్‌ జట్టును ఎండగడుతూనే భారత్‌ను కొనియాడాడు.

"టీమ్‌ఇండియా వార్మప్‌ మ్యాచ్‌లను బాగా ఉపయోగించుకుంది. ఆ జట్టులో ప్రతి ఒక్కరు ఐపీఎల్‌ ఆడి వచ్చినా అందరికీ అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఇలా కాకుండా అత్యుత్తమ పదకొండు మందే వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఆడినా వాళ్లని సమర్థించొచ్చు. ఎందుకంటే.. ఐపీఎల్‌లో వాళ్లంతా ఒకే జట్టు తరఫున ఆడలేదు కాబట్టి ఇప్పుడలా ఆడారని వాదించొచ్చు. అయినా వాళ్లు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పాక్‌ జట్టులో ఎలాంటి అభద్రతాభావాలు ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు. బాబర్‌ నువ్వొక సారథివి. నువ్వు ఆటగాళ్లందర్నీ ఉపయోగించుకోవాలి. ఇంకెప్పుడు అలా చేస్తావ్‌."

-సల్మాన్‌ బట్, పాక్ మాజీ ఆటగాడు.

"ఓపెనర్లుగా నువ్వూ, రిజ్వాన్‌ బరిలోకి దిగారు. ఒకవేళ మీరిద్దరూ తొలి ఓవర్‌లో పెవిలియన్‌ చేరితే అప్పుడు ఇంకో బ్యాట్స్‌మన్‌ కొత్త బంతితో ఆడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో బాబర్‌ ఆదిలోనే ఔటయ్యాడు. అలాంటప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు?మీ ప్రణాళికలు ఏంటో నాకు అర్థంకావడం లేదు. ఇప్పటికే ఏడాదిన్నరగా మీరిద్దరే ఓపెనర్లుగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ మీరే ఆడితే జట్టుకు ఏం ఉపయోగం? దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో హైదర్‌ అలీ, అసిఫ్‌ అలీ, మహ్మద్‌ వాసిమ్‌, మహ్మద్‌ నవాజ్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సింది. ఒకవేళ మీరు బాగా ఆడి దక్షిణాఫ్రికాపై 300 పరుగులు చేసి గెలిచినా.. మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోతే ఈ మ్యాచ్‌ ఆడి ఏం ప్రయోజనం?" అని పాక్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా, ఈ వార్మప్‌ మ్యాచ్‌ల్లో(Pakistan warm-up match 2021) పాక్ తొలుత డిఫెండింగ్‌ ఛాంపియన్ వెస్టిండీస్‌పై గెలుపొందినా తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ ప్రధాన ఆటగాళ్లతోనే ఆడటం గమనార్హం. మరోవైపు టీమ్‌ఇండియా కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌.. ఇలా అందరి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. వాళ్లంతా బాగా ఆడి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియాని గెలిపించారు. దీంతో ప్రపంచకప్‌కు ముందు ఫామ్‌లోకి రావడమే కాకుండా పూర్తి ఆత్మవిశ్వాసం పొందారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ జట్టుపై సల్మాన్‌ తీవ్రంగా స్పందించాడు.

ఇదీ చదవండి:

T20 World Cup: భారత్​ 5, పాక్​ 0.. ఈసారి గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details