Sakshi Malik VS Babita Phogat : రెజ్లర్ల నిరసనను.. బీజేపీ నాయకురాలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత బబితా ఫొగాట్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ ఆరోపించింది. అసలు జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన తెలిపేందుకు అనుమతి తీసుకున్నదే బబిత, మరో భాజపా నాయకుడు అని చెబుతూ అని సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్త్ కడియన్ చెప్పారు.
Sakshi Malik Twitter : ఈ మేరకు సోషల్ మీడియాలో శనివారం ఓ వీడియో విడుదల చేశారు. ''ఈ వీడియోలో తీర్థ్ రాణా, బబిత ఫొగాట్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రెజ్లర్లను ఉపయోగించుకోవడానికి ఎలా ప్రయత్నించారో అనే విషయాన్ని వివరించాం. రెజ్లర్లు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్లు ప్రభుత్వానికి ఎలా అనుకూలంగా వ్యవహరించారో చెప్పాము'' అని సాక్షి ఆదివారం ట్వీట్ చేసింది.
సాక్షి మాలిక్ చేసిన ఆరోపణలను భాజపా నాయకుడు తీర్థ్ రాణా కొట్టిపారేశారు. "రెజ్లర్లు వచ్చి నన్ను (నిరసన చేసే ముందు) కలిశారు. వారు ఇబ్బందులకు గురవుతున్నారని మాకు చెప్పారు. మా సోదరీమణులు, కుమార్తెలతోనే మేము ఉన్నామని వారికి చెప్పాము. న్యాయం కోసం క్రీడాకారులు చేసే పోరాటంలో వారితో నేను ఉన్నాను. ఇంతకుముందు వారివైపే ఉన్నాను. ఇకముందు కూడా వారి వైపే ఉంటాను. రెజ్లర్లు దేశానికి గర్వకారణం. క్రీడాకారులను బీజేపీ గౌరవిస్తుంది. నేను కూడా గౌరవిస్తాను. నేను ఎప్పుడూ క్రీడాకారులకు మద్దతు ఇస్తాను" అని రాణా ఒక వీడియోలో పేర్కొన్నాడు.
బబిత ఫొగాట్ ఏమందంటే..
జనవరిలో రెజ్లర్లు నిరసన చేసినప్పుడు వారికి, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం చేసిన బబిత ఫొగాట్.. సాక్షి ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. ''సాక్షి మాలిక్, సత్యవర్త్‌ల వీడియో నన్ను బాధించింది. అదే సమయంలో నవ్వు కూడా వచ్చింది. పోలీసుల అనుమతి కోరుతూ సమర్పించిన లేఖపై నా సంతకం లేదు. ఆ నిరసనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మొదటి రోజు నుంచే నేను రెజ్లర్ల నిరసనకు అనుకూలం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాను కలవమని వాళ్లకు చెప్పిను. కానీ వాళ్లు మాత్రం దీపేందర్ హుడా, కాంగ్రెస్, ప్రియాంక గాంధీల వద్ద పరిష్కారం ఉందని అనుకున్నారు'' అని బబిత ఫొగాట్ చెప్పింది.