Sachin's tribute to Warne: దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ తెందూల్కర్. వార్న్ గొప్ప కాంపిటీటర్ అని, అతడిని ఎదుర్కొనేందుకు భిన్నంగా సిద్ధమయ్యేవాడినని సచిన్ చెప్పాడు. మైండ్ గేమ్ ఆడటంలో వార్న్ దిట్ట అని చెప్పుకొచ్చాడు. మార్చి 4 థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించిన వార్న్ మృతి పట్ల సంతాపం తెలిపాడు సచిన్. ఈ సందర్భంగా.. వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
"1998 సిరీస్‌లో షేన్ వార్న్‌ను నేను ఎదుర్కొన్నా. ఆ సిరీస్‌ను 'సచిన్ వర్సెస్ వార్న్' సిరీస్‌గా అభిమానులు పిలుచుకునేవారు. ఇది మా ఇద్దరి మధ్య సిరీస్ కాదు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అని నేను చెబుతూ వచ్చా. కానీ ఆ పద ప్రయోగం కొనసాగుతూనే వచ్చింది. వార్న్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సిద్ధమయ్యేవాడిని. నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడే కాదు.. గదిలో కూర్చున్నప్పుడు కూడా ఇదే ఆలోచించేవాడిని. అతడి కంటే ఒక అడుగు ముందు ఉండాలని అనుకునేవాడిని. ఎందుకంటే అతడు మన ఆలోచనలను గ్రహించి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాడు. అలాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను ఎదుర్కొనే సమయంలో కచ్చితంగా ఒత్తిడికి గురవుతాం. అతడి బాడీ లాంగ్వేజీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి బంతినీ అత్యంత కచ్చితత్వంతో వేస్తాడు. మంచి స్పిన్నర్లు చాలా మంది ఉంటారు. కానీ వార్న్ చాలా భిన్నం."
-సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్
2021 ఐపీఎల్ సీజన్ తర్వాత వార్న్‌ను కలిసిన రోజులను గుర్తు చేసుకున్నాడు సచిన్. లండన్‌లో అతడితో కలిసి మాట్లాడినట్లు తెలిపాడు. 'ఎప్పుడు కలిసినా.. పూర్తి ఎనర్జెటిక్‌గా ఉంటాడు. ఎప్పుడూ జోక్‌లు వేస్తుంటాడు. జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అతడు లేడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. కానీ, వార్న్ మన గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు' అని సచిన్ చెప్పుకొచ్చాడు.