ముంబయిలోని వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ నిలువెత్తు విగ్రాహం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన విగ్రహాన్ని పెట్టే స్థలాన్ని పరిశీలించేందుకు.. మాస్టర్ బ్లాస్టర్ భార్య అంజలితో కలిసి మంగళవారం వాంఖడే స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం విగ్రహాం ఏర్పాటు చేసే స్థలంపైన తుది నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సచిన్ తెందుల్కర్.. "ప్లెజెంట్ సర్ప్రైజ్.. నా కెరీర్ ఇక్కడే మొదలైంది. నా కెరీర్ అద్భుతమైన జ్ఞాపకాలతో సాగింది. 2011లో వరల్డ్ కప్ ఇక్కడే గెలిచాం. అదే నా కెరీర్లో బెస్ట్ మూమెంట్." అని వివరించాడు. సచిన్ తెందుల్కర్‌తో ముంబయి క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, ఏప్రిల్ 24న సచిన్ 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనికి ఒక్క రోజు ముందు వాంఖడె సచిన్‌కు అత్యంత ఇష్టమైన వాంఖడే స్టేడియంలో అతడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముంబయి క్రికెట్ అసోషియేషన్ భావిస్తోంది. దానికి సచిన్ కూడా అంగీకారం తెలిపారు. ఇది వాంఖడే స్టేడియంలో పెడుతున్న తొలి విగ్రహమని అధికారులు తెలిపారు. ఇది వరేకే ఈ స్టేడియంలో ఓ స్టాండ్‌కు సచిన్ పేరు పెట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు.