Sachin Tendulkar Statue Wankhede Stadium :క్రికెట్ దిగ్గజం, భారతరత్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. నవంబర్ 1న సచిన్ హోం గ్రౌండ్ ముంబయి వాంఖడే స్టేడియంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ విషయాన్ని స్వయంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఆధ్యక్షుడు అమోల్ కాలే వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సచిన్ తెందూల్కర్‌తో పాటు భారత క్రికెట్ జట్టు సభ్యులు, సిబ్బంది తదితరులు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెందూల్కర్ స్టాండ్..మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ముంబయి వాంఖడే స్టేడియంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు ఈ మైదానంలో క్రికెట్ ఆడినా.. పెద్ద ఎత్తున అభిమానుల సపోర్ట్ ఉండేది. ఇప్పటికే ఈ స్టేడియంలో ఆయన పేరిట 'సచిన్ రమేశ్ తెందూల్కర్' స్టాండ్ ఉంది. ఇప్పుడు తాజాగా ఈ స్టాండ్ పక్కనే విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదితో సచిన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ విధంగా తెందూల్కర్‌ను స్టేడియం నిర్వాహకులు గౌరవించనున్నారు.
వాంఖడేతో తెందూల్కర్ అనుబంధం.. సచిన్ సొంత రాష్ట్రం మహారాష్ట్ర కావడం వల్ల ముంబయి వాంఖడేతో అనుబంధం ఏర్పడింది. సెంట్రల్ ముంబయి దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయన గురువు రామాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ తీసుకునేవారు. సచిన్ చిరకాల స్వప్నం ప్రపంచకప్ కల నెరవేరింది కూడా ఈ మైదానంలోనే. 2011 వరల్డ్‌కప్ శ్రీలంకతో.. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది ఇక్కడే. ఆ తర్వాత రెండేళ్లకు సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిందీ ముంబయి వాంఖడేలోనే. ఆయన వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో ఆటకు గుడ్‌బై చెప్పారు.