Sachin Tendulkar Signature Shot : మైదానంలో మెరుపులు.. కళ్లు చెదిరే సిక్సులు.. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లు.. ఇలా ఒకప్పటి సచిన్‌ను 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' మనముందుకు తీసుకువస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న ఈ సిరీస్‌లో సచిన్ 'ఇండియా లెజెండ్స్'కు సారథ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. 49 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో మైదానంలో ఆనాటి మెరుపులు మెరిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ మాస్టర్ బ్లాస్టర్ మరోసారి తన సత్తా చాటాడు.
ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లో 40 పరుగులు చేసి సచిన్ ఔరా అనిపించాడు. ఇందులో అబ్బురపరిచే మూడు భారీ సిక్సులు ఉండటం మరో విశేషం. క్రిష్ ట్రెమ్లెట్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోరు బాది ప్రత్యర్థి ఫీల్డర్లతోపాటు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఓవర్‌లో సచిన్ కొట్టిన రెండో సిక్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 1998లో షార్జాలో ఆడిన ఇన్నింగ్స్‌తో అతడు కొట్టిన షాట్‌తో పోల్చుతూ అభిమానులు మాస్టర్ బ్లాస్టర్‌ను
మెచ్చుకుంటున్నారు. ఇక 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ లెజెండ్స్ 6 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది.