భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కొవిడ్ నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా ప్రకటించాడు. త్వరలోనే ప్లాస్మా దానం చేస్తానని వెల్లడించాడు. మహమ్మారి వల్ల గత నెల కఠినంగా సాగిందని తెలిపాడు. అందరి ప్రార్థనలతో సురక్షితంగా బయటపడ్డానని పేర్కొన్నాడు.
గత నెల 27న సచిన్‌కు కొవిడ్ నిర్ధారణ అయింది. తర్వాత ఆస్పత్రిలో చేరిన తెందూల్కర్.. ఏప్రిల్ 8న డిశ్చార్జి అయ్యారు. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు లిటిల్ మాస్టర్. శనివారం 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాస్టర్ బ్లాస్టర్.. సరిగ్గా ఇదే రోజు కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్ పిచ్‌లు చెత్తగా ఉన్నాయి: స్టోక్స్
"ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా వైద్యులు నాకొక సందేశాన్ని సూచించారు. సరైన సమయంలో ప్లాస్మా దానం చేస్తే రోగులు వేగంగా కోలుకుంటారని వారు నాకు చెప్పారు. ప్రస్తుతం నేను కూడా కొవిడ్ నుంచి కోలుకున్నాను. త్వరలోనే డాక్టర్ల సలహా మేరకు ప్లాస్మా దానం చేస్తాను."
-సచిన్ తెందూల్కర్, మాజీ క్రికెటర్.
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని సచిన్ కోరాడు. దీని వల్ల వైరస్ బారిన పడ్డ వారిని కాపాడడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు క్రికెట్ దిగ్గజం. కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలే తాను కోలుకునేలా చేశాయని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి