టీ20లో ప్రపంచకప్లో టీమ్‌ఇండియా అనుసరించాల్సిన వ్యూహాలపై దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా తుది జట్టులో ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
"జట్టులో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఉంటే అది కచ్చితంగా అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లకు అందుకు అనుగుణంగా కుదురుకోవాల్సి ఉంటుంది. తరచూ స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల బౌలర్లను ఇరుకున పెట్టొచ్చు" అని వివరించాడు. జట్టులో టాప్ 3 స్థానాల గురించి మాట్లాడుతూ.. కేవలం ముగ్గురిపైనే ఆధారపడి ముందుకు వెళ్లకూడదని తెలిపాడు. ఎవరు ఎందులో బాగా రాణిస్తారో తెలుసుకుని వారిని ఆ స్థానంలో పంపాలని, అదే సమయంలో ప్రత్యర్థి బలాలను అంచనా వేయాలని ఈ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.