Sachin Tendulkar India VS South Africa Test Series :సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం, అంతక ముందు రోజు కేఎల్ రాహుల్ సెంచరీలు ఏమాత్రం తోడ్పడకపోవడం వల్ల మూడో రోజుకే మ్యాచ్ ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌పై పలువురు టీమ్ఇండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మ్యాచ్‌ను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ విశ్లేషించాడు. భారత బ్యాటర్ల షాట్ల ఎంపిక సరిగ్గా లేదంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికా ఆటతీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్ తర్వాత ఆ జట్టు వెనకబడుతుందని నేను భావించాను. కానీ ఆ టీమ్ పేసర్లు అంచనాలనకు మించి బౌలింగ్ చేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సఫారీల జట్టు అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌కు కూడా పిచ్ అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ, బ్యాటర్లు షాట్లు ఆడిన తీరు బాగోలేదు. ఈ టెస్ట్ మ్యాచులో ఎల్గర్, జాన్సన్, బెడింగ్ హామ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా గొప్ప నైపుణ్యాలతో బాగా బ్యాటింగ్ చేశారు" అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
మ్యాచ్ సాగిందిలా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సఫారీలు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది.