Sachin Die Hard Fan Sudheer: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే బహుశా తెలియని టీమ్ఇండియా అభిమానులు ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు భారత్ క్రికెట్ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సుధీర్ స్టాండ్స్‌లో సందడి చేసేవాడు. విదేశాలకు కూడా వెళ్లి సచిన్ ఆడిన మ్యాచ్‌లను చూసేవాడు. కొన్ని సందర్భాల్లో బీసీసీఐ ప్రత్యేక రాయితీ కల్పించి మరీ విదేశాల్లో జరిగే మ్యాచ్‌లు చూడ్డానికి సుధీర్‌ను పంపేది. అయితే సచిన్ సైతం సుధీర్‌కు చాలా మర్యాద ఇచ్చేవాడు.
ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా భారత లెజెండ్స్ జట్టుకు సచిన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. 49 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో మైదానంలో ఆనాటి మెరుపులు మెరిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న భారత లెజెండ్స్ జట్టు.. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో తలపడనుంది. దీంతో సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి మ్యాచ్ చూడటానికి రాయ్‌పుర్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..
ఈటీవీ భారత్: మొదటగా సచిన్‌పై అంత అభిమానం మీకు ఎలా కలిగింది?
సుధీర్ కుమార్ చౌదరి: కాలేజీ రోజుల్లో ఒక జర్నలిస్ట్ నాకు సచిన్ గురించి చెప్పాడు. అతడ్ని కలవమని కూడా సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి సచిన్‌పై అభిమానం పెరుగుతూ వచ్చింది.
ఈటీవీ భారత్: సచిన్‌కు వీరాభిమానిగా ఎలా మారారు?
సుధీర్ కుమార్: 2001 జనవరి 19న భారత్ జట్టు ఆడిన మ్యాచ్‌ను తొలిసారిగా చూశాను. ఆ తర్వాత అదే నెలలో కాన్పూర్‌లో జరిగిన మరో మ్యాచ్ వీక్షించాను. అదే ఏడాదిలో జరిగిన భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు కూడా వెళ్లాను. అలా నా విద్యార్థి జీవితంలో మూడు మ్యాచులు చూశాను. అలా అప్పటి నుంచి సచిన్‌గా వీరాభిమానిగా మారిపోయాను.