Sachin Tendulkar birthday: టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ దైవం సచిన్ తెందూల్కర్‌కు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అరటిపండ్లు తింటూ సచిన్‌కు విషెస్ చెప్పాడు. ఈరోజు మాట్లాడకుండా ఉంటానని చెప్పుకొచ్చాడు. 'డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు నేను సైలెంట్‌గా ఉండాలని సచిన్ కోరుకునేవాడు. పరుగులు చేసినా చేయకపోయినా నేను పెవిలియన్‌లో మాట్లాడకుండా ఉండాలని అనుకునేవాడు. నన్ను మాట్లాడకుండా చేసేందుకు తరచూ అరటిపండ్లు తినిపించేవాడు. ఈరోజు సచిన్ పుట్టిన రోజు కాబట్టి నేను నా మౌనాన్ని అతనికి గిఫ్ట్‌గా ఇస్తున్నా. ఈరోజు ఏం మాట్లాడను' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు సెహ్వాగ్.
Sachin Tendulkar Virendra Sehwag: కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఆదివారం.. 49వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, ప్రజ్ఞాన్ ఓజా, ఇషాన్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ తదితరులు బర్త్‌డే విషెస్ చెప్పారు.
- "664 మ్యాచ్‌లు.. 34,357 పరుగులు.. 100 సెంచరీలు.. 201 వికెట్లు.. ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తిమంతంగా నిలిచిన దిగ్గజ క్రికెటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు"- బీసీసీఐ
- "కోట్లాది మందిని తన ఆటతో కలిపిన గాడ్ ఆఫ్ క్రికెట్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మైదానంలో మ్యాజిక్ చేసిన సచిన్.. ఆఫ్ ఫీల్డ్‌లోనూ ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు"- జై షా, బీసీసీఐ కార్యదర్శి
- "ఇదొక మరుపురాని రోజు. మంచితనం, టాలెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందర్భం. జీవితంలో అన్ని కలలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆరోగ్యం, ఐశ్వర్యంతో జీవితం గడపాలని ఆశిస్తున్నా"- వీవీఎస్ లక్ష్మణ్
- "మానవత్వానికి మరో రూపం. అసలైన దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు"- గౌతమ్ గంభీర్
- "పాజీ హ్యాపీ బర్త్‌డే. ప్రస్తుతం బబుల్ ఉన్న నువ్వు బయటకొచ్చాక మనం సెలబ్రేట్ చేసుకుందాం"- హర్భజన్ సింగ్