Sachin Tendulkar Arshdeep Singh : ఆసియా కప్ సూపర్-4 పోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ వదిలేసి విమర్శల పాలైన టీమ్‌ఇండియా యువ బౌలర్ అర్ష్‌దీప్‌కు పలువురు క్రికెటర్లు, మాజీలు అండగా నిలుస్తున్నాడు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కూడా దీనిపై స్పందిస్తూ అర్ష్‌దీప్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. దేశం కోసం ఆడుతున్న క్రీడాకారులపై వ్యక్తిగత దాడులు తగవని సూచించాడు.
"దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి అథ్లెట్ తనలోని అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ దేశం కోసమే ఆడుతాడు. అలాంటి వారికి మనం నిరంతర మద్దతు అందించాలి. గుర్తుంచుకోండి.. ఆటల్లో గెలుపోటములు సహజమే. కొన్ని సార్లు గెలవచ్చు. మరికొన్ని సార్లు ఓడిపోవచ్చు. అది క్రికెట్ అయినా మరే ఆటైనా సరే.. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉంచాలి. అర్ష్‌దీప్ సింగ్.. కష్టపడుతూనే ఉండు. మైదానంలో నీ ప్రదర్శనతో ఇలాంటి విమర్శలకు దీటైన సమాధానం ఇవ్వు. నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు భవిష్యత్ మరింత బాగుండాలి" అని సచిన్ రాసుకొచ్చారు.