తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్.. క్రికెట్ ప్రేమికుల్ని వెంటాడే ఓ ఎమోషన్! - సచిన్ తెందూల్కర్ గణాంకా్లు

భారత క్రికెట్​ దేవుడు సచిన్​ తెందూల్కర్​ నేడు 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అతడి క్రికెట్​ జర్నీపై ఓ లుక్కేద్దాం. అతడి గురించి పలువురు మాజీల అభిప్రాయాలు తెలుసుకుందాం.

sachin
సచిన్

By

Published : Apr 24, 2021, 9:04 AM IST

సచిన్‌.. సచిన్‌.. ఈ పేరు మారుమోగని క్రికెట్​ మైదానం ఈ ప్రపంచంలో దాదాపు ఉండదేమో అంటే అతిశయోక్తి కాదు. సచిన్‌ అడుగుపెట్టని మైదానం లేదు. పరుగులు చేయని పిచ్‌ లేదు. రికార్డు సృష్టించని దేశం లేదు. అసలు సచిన్‌ లేని క్రికెట్‌ ప్రపంచమే లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే సచిన్‌ రమేశ్‌ తెందూల్కర్‌ అనేది పేరు కాదు.. ఇది భారత క్రికెట్‌కు ఓ ఎమోషన్‌. క్రికెట్లో సచిన్‌ రికార్డుల గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారనుకుంటున్నారా.. ఈ రోజు భారత క్రికెట్‌ దేవుడు సచిన్‌ పుట్టినరోజు. మాస్టర్‌ బ్లాస్టర్‌ నేటితో 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు క్రికెట్‌ దిగ్గజాలు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఓసారి గుర్తు చేసుకుందాం..

సచిన్

సాధారణ కుటుంబంలో జన్మించి..

1973 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ మరాఠి నవలా రచయిత రమేశ్‌ తెందూల్కర్‌ ఇంట్లో జన్మించారు సచిన్‌. లెజెండరీ సంగీత విధ్వాంసుడైన సచిన్‌ దేవ్‌ బర్మన్‌కు సచిన్‌ వాళ్ల నాన్న వీరాభిమాని. అందుకే తన కొడుక్కి సచిన్‌ అనే పేరు పెట్టారు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అడుగుపెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా తన సుధీర్ఘ క్రికెట్‌ ప్రయాణంలో 100 అంతర్జాతీయ శతకాలు సాధించి, 34,357 పరుగులు చేశారు. 200 టెస్టుల్లో 15,921పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. ఒక టీ20 మ్యాచ్‌ కూడా ఆడారు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా సచిన్‌ రికార్డు సృష్టించారు. 2010లో దక్షిణాఫ్రికాతో గ్వాలియర్‌లో జరిగిన వన్డేలో సచిన్‌ ఈ రికార్డు నమోదు చేశారు. ఆరుసార్లు ప్రపంచకప్‌కు ఆడిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

సచిన్‌ గొప్పతనాన్ని తెలిపే క్రికెట్‌ దిగ్గజాల అభిప్రాయాలు..

  • సచిన్‌ బ్యాటింగ్‌లో నన్ను నేను చూసుకున్నా. - సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌.
  • మా మనవలు.. నేను టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన విషయాన్ని మర్చిపోయినా సచిన్‌ నా జట్టు సభ్యుడు అనే విషయాన్ని మాత్రం మరిచిపోరు. - రాహుల్‌ ద్రవిడ్‌, భారత మాజీ క్రికెటర్‌.
  • నేను క్రికెట్‌ దేవుణ్ని చూశాను. ఆ దేవుడు భారత్‌ టెస్టు జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే వాడు. - మాథ్యూ హెడెన్‌, ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌.
  • మీరు సచిన్‌ను ఔట్‌ చేస్తే.. సగం మ్యాచ్‌ గెలిచినట్లే. - అర్జున రణతుంగ, శ్రీలంక మాజీ కెప్టెన్‌.
    సచిన్
  • బాస్కెట్‌ బాల్‌కి మైకెల్‌ జోర్డాన్‌.. బాక్సింగ్‌కు మహమ్మద్‌ అలీ ఎలాగో.. క్రికెట్‌కు సచిన్‌ తెందుల్కర్‌ అలా.. - బ్రియాన్‌ లారా.
  • మేము ఓడిపోతే.. అది టీమ్ఇండియా చేతిలో అనేవాళ్లం కాదు. సచిన్‌ చేతిలో ఓడిపోయాం అనుకునేవాళ్లం. - మార్క్‌ టేలర్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.
  • సచిన్‌ ఉన్న విమానంలో ఉంటే మాకు ఎటువంటి హానీ జరగదని మా నమ్మకం. - హషీమ్‌ ఆమ్లా, దక్షిణాఫ్రికా క్రికెటర్‌.
  • చేతి కర్రతో కూడా బ్యాటింగ్‌ చేయగల బ్యాట్స్‌మన్‌ సచిన్‌ మాత్రమే. -అనిల్‌ కుంబ్లే, భారత మాజీ క్రికెటర్‌.
  • సచిన్‌లాంటి క్రికెటర్‌ నాతో కలిసి క్రికెట్‌ ఆడినందుకు ఎంతో గర్వపడుతున్నా. -వసీం అక్రమ్‌, పాక్ మాజీ క్రికెటర్
  • నా బౌలింగ్‌లో సచిన్‌ సిక్సర్లు కొట్టినప్పుడు నాకు పీడకలలా మిగిలిపోయేవి. - షేన్‌ వార్న్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.
  • నేను డాన్‌ బ్రాడ్‌మన్‌ను చూడలేదు. కానీ సచిన్‌ తెందూల్కర్‌ కంటే మెరుగైన బ్యాట్స్‌మన్‌ ఎవరూ లేరని చెప్పగలను. - వివ్ రిచర్డ్స్‌, వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌.
  • మీరు సచిన్‌తో ఆడాల్సి వచ్చినప్పుడు అతను పరుగులు చేయాలనే కోరుకుంటారు. - మార్క్‌ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
    సచిన్

సచిన్‌ అందుకున్న పురస్కారాలు..

1994లో అర్జున అవార్డు

1997లో రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు

1999లో పద్మశ్రీ అవార్డు

2008లో పద్మ విభూషణ్‌

2014లో భారతరత్న

ABOUT THE AUTHOR

...view details