Sachin About Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన కుమారుడు అర్జున్ తెందూల్కర్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడారు. ముందుగా ఆటపై శ్రద్ధ పెట్టాలని అర్జున్‌కు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన స్వేచ్ఛను ఇవ్వాలని సచిన్ కోరారు. 'సింటిలేటింగ్ సచిన్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో బాధ్యతగా ఉండాలని గుర్తుచేశారు. పిల్లలు వారు కోరుకున్న రంగాల్లో రాణించడానికి కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే తాను ఎంచుకున్న క్రికెట్ రంగంలో రాణించడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.
"నాకు కుటుంబసభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించింది. ఏదైనా సమస్య వస్తే అజిత్ తెందూల్కర్ (తమ్ముడు) చూసుకునేవాడు. నితిన్ తెందూల్కర్ (తమ్ముడు) నా పుట్టినరోజున నా కోసం ప్రత్యేకంగా పెయింటింగ్ వేయించాడు. మా అమ్మ ఎల్‌ఐసీలో, నాన్న ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులందరూ ఇదే విధంగా తమ పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నా" అని అన్నారు.
తన కుమారుడు అర్జున్ తెందూల్కర్ క్రికెట్ కెరీర్ గురించి సచిన్ స్పందిచారు. "నాకు నా తల్లిదండ్రులు ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చారో అర్జున్ తెందూల్కర్‌కు కూడా అదే విధమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా. నా తండ్రి నాకు ఏ విధమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారో.. ప్రస్తుతం అర్జున్‌కు నేనూ అలాంటి సలహాలే ఇస్తున్నా. నీపై నీకు నమ్మకం ఉండాలి అని అర్జున్‌కు పదే పదే చెప్తాను. అప్పుడే ఎదుటివారికి నీపై నమ్మకం ఏర్పడుతుంది, ముందు నువ్వు నీ ఆటపై దృష్టిపెట్టడం ముఖ్యమని అర్జున్‌కు చెప్తుంటా" అని సచిన్ అన్నారు.
Arjun Tendulkar IPL Debut : కాగా, అర్జున్ తెందూల్కర్ గత రెండేళ్ల నుంచి ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుతోనే ఉంటున్నాడు. ఎట్టకేలకు ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ చేసే అర్జున్ ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మొదటి మ్యాచ్‌లో వికెట్ తీయకపోయినా ఫర్వలేదనిపించే ప్రదర్శన చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లో తొలి వికెట్ తీశాడు. తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. ఒకే ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో 4 మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. కేవలం మూడు వికెట్లే తీశాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టు (ముంబయి ఇండియన్స్) తరఫున ఆడిన మొదటి తండ్రీ-కొడుకులుగా సచిన్-అర్జున్ రికార్డు సృష్టించారు.